: క్లెయిమ్ తిరస్కరించిన బీమా కంపెనీకి జరిమానా
పోయిన కారుకు పరిహారం తిరస్కరించిన బీమా కంపెనీకి వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. ముంబైకి చెందిన హరీష్ చవాన్ 2011లో మరొక వ్యక్తి నుంచి కారు కొనుగోలు చేశాడు. వెంటనే ఆర్టీవో కార్యాలయంలో కారు యజమానిగా తన పేరును నమోదు చేయించుకున్నాడు. అక్టోబర్ 17న కారు దొంగతనానికి గురైంది. కారు ఇన్సూరెన్స్ అంతకుముందు యజమాని పేరుతో ఉంది. దాంతో చవాన్ పాత యజమానితో పోలీసులకు ఫిర్యాదు చేయించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు దరఖాస్తు చేశాడు. దాన్ని రిలయన్స్ బీమా సంస్థ తిరస్కరించింది. కారును సరిగా రక్షించుకోలేకపోయారని, యాజమాని పేరు మారిన విషయాన్ని 14 రోజుల్లోగా తెలియజేయనందున క్లెయిమ్ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో చవాన్ ముంబైలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఇలాంటి సాంకేతిక కారణాలు చూపించి క్లెయిమ్ తిరస్కరించడం సరికాదని కమిషన్ తేల్చిచెప్పింది. జరిమానాగా రూ.40వేలు, ఇన్సూరెన్స్ కింద 2.4లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.