: కెప్టెన్సీ చేపట్టు.. రూ.10 కోట్లు పట్టు: క్లార్క్ కు 'పుణే' బంపర్ ఆఫర్
గాయంతో ఐపీఎల్ కు దూరమవ్వాలని నిర్ణయించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ ను.. పుణే ఫ్రాంచైజీ విసిరిన బంపర్ ఆఫర్ ఊరిస్తోంది. మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ ఆరవ సీజన్ లో తమ జట్టుకు సారథ్యం వహిస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ పుణే వారియర్స్ బేరం పెట్టినట్టు సమాచారం. దీంతో, క్లార్క్ ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నాడని 'ద ఆస్ట్రేలియన్' పత్రిక పేర్కొంది.
గత వేలంలో పుణే ఫ్రాంచైజీ క్లార్క్ ను రూ. 2.1 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, తాజా సీజన్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పుణే జట్టు యాజమాన్యం క్లార్క్ సారథ్యంపై నమ్మకముంచింది. గాయంతో బాధపడుతున్నా సరే క్లార్కే కావాలంటూ, భారీ మొత్తం చెల్లించడానికి సైతం సిద్ధపడింది. కాగా, ఈ విషయంపై క్లార్క్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. వెన్ను గాయానికి ఎక్స్ రే తీయించిన తర్వాత, వైద్య నిపుణుల సలహాను అనుసరించి తదుపరి నిర్ణయం తీసుకుంటానని క్లార్క్ అంటున్నాడు.