: 'కాంగ్రెస్ హటావో'తో ఏకమవుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన
టీడీపీ, బీజేపీ, జనసేన... ఈ పార్టీల లక్ష్యం ఒకటే... కాంగ్రెస్ ను తరిమి కొట్టండి (కాంగ్రెస్ హటావో). ఈ లక్ష్యంతో ఇప్పటికే దగ్గరైన టీడీపీ, బీజేపీలతో కలవడానికి 'నేను సైతం' అంటూ జనసేన కూడా కదులుతున్నట్టు సమాచారం అందుతోంది. పార్టీ ప్రారంభోపన్యాసం సమయంలో పవన్ టీడీపీని ఒక్క మాట కూడా అనలేదు... అంతేకాదు, 'చంద్రబాబు గారా, ఆయన మంచి వ్యక్తి' అని కితాబిచ్చారు. అయితే, జనసేన సభ జరిగిన తర్వాత పవన్ మళ్లీ కనిపించలేదు. కానీ, ఆయన కలవాల్సిన వారందరినీ కలుస్తున్నారు... మాట్లాడాల్సిన వారందరితో మాట్లాడుతున్నారు.
పార్టీ ప్రారంభించిన మరుసటి రోజే చంద్రబాబుతో పవన్ సమావేశమయినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబును పవన్ కలవడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతేకాదు, వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో కూడా భేటీ అయ్యారనే సమాచారం ఉంది. తన సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను బీజేపీ పెద్దలకు పవన్ స్పష్టంగా తెలిపారు. అంతే కాదు, ఎన్నికల్లో ఏయే పార్టీలను ఓడించాలనుకుంటున్నాడో కూడా స్పష్టం చేశారు. పవన్ ప్రతిపాదనకు బీజేపీ సానుకూలంగా స్పందించింది. మరో రెండు మూడు రోజుల్లో మరోసారి ఢిల్లీ వెళ్లి మోడీని కలవాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు జతకట్టనున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.