: అంగరంగ వైభవంగా శ్రీకూర్మనాథుని డోలోత్సవాలు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీకూర్మంలో స్వామివారి డోలోత్సవాలు ఈరోజు (సోమవారం) ఘనంగా ముగిశాయి. కూర్మనాథ స్వామికి ప్రపంచంలోనే ఏకైక దేవాలయం ఉన్న శ్రీకూర్మంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు డోల మంటపంలో ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం గజవాహనంపై స్వామి వారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగించారు. అనంతరం డోల మంటపానికి తీసుకెళ్లి స్వామివారిని అక్కడి ఊయలలో ఉంచారు. ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శనివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో తొలిరోజున కామదహనం, రెండవరోజున పడియ, మూడవ రోజున డోలోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుండి కూడా సుమారు లక్ష మంది భక్తులు శ్రీ కూర్మనాథుని దర్శించుకున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఈవో శ్యామలాదేవి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాట్లను శ్రీకాకుళం డీఎస్సీ, ఎస్.ఐ పర్యవేక్షించారు.