: ఆ రాష్ట్రం చిన్నదే... కానీ, రెండు విడతలుగా పోలింగ్!
భారతదేశపు ఈశాన్యం చివరన ఉన్న చిన్న రాష్ట్రం త్రిపుర. అలాంటి బుల్లి రాష్ట్రం త్రిపురలో ఎన్నికలైతే మాత్రం 93 శాతం పోలింగ్ జరుగుతుంది... అక్కడ ఓటర్లలో అంత చైతన్యం ఉంది మరి! అయితే అక్కడో చిక్కొచ్చి పడింది. సరిహద్దుకు అటువైపు నుంచి బంగ్లాదేశీలు చొరబడి ఓటు వేసి వెళ్లిపోతుంటారు. రాష్ట్రం రాజధాని అగర్తలాలో మూడువైపులా బంగ్లా ఉంటుంది. చాలా మంది బంగ్లాదేశీలు ఉదయమే అగర్తలాకి వచ్చి రిక్షాలు నడుపుతూ డబ్బులు సంపాదించుకుని, సాయంత్రానికి తిరిగి వెళ్లిపోతూంటారు. అందుకే ఎన్నికలు రాగానే 856 కి.మీ పొడవైన అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తారు.
త్రిపురలో ఉన్నవి రెండు లోక్ సభ సీట్లు. కానీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయి. అక్కడ తూర్పు త్రిపుర, పశ్చిమ త్రిపుర రెండు లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఈ రాష్ట్రం మూడు వైపులా బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ దఫా వెస్ట్ త్రిపురలో ఏప్రిల్ 7న, ఈస్ట్ త్రిపురలో ఏప్రిల్ 12న ఎన్నికలు జరుగనున్నాయి.