: ఢిల్లీలో మహిళా ఉద్యోగుల బయటి చూపులు
అత్యాచారాలకు రాజధానిగా అప్రదిష్ట తెచ్చుకున్న ఢిల్లీ నగరం తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మహిళలు భావిస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఢిల్లీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లో 43 శాతం మంది రాజధాని వీడి మరో ప్రాంతానికి వెళదామనుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని నిర్వహించింది. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతులు అందరూ కూడా ఢిల్లీలో మహిళలకు భద్రత లేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
3,400 మంది మహిళల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు. ఢిల్లీలో ఉద్యోగాలు చేస్తున్న స్థానికేతర మహిళల్లో సుమారు సగం మంది ఢిల్లీ తమకు సురక్షితం కాదని, తమ స్వస్థలాలకు దగ్గర్లోని పట్టణాల్లో ఉద్యోగాలు వెతుక్కోవాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. భద్రత కోసం అవసరమైతే జీతం తక్కువైనా పర్లేదని తెలిపారు. 80 శాతం మంది ఢిల్లీలో డే షిఫ్టులనే కోరుకుంటున్నారట.