: గుజరాత్ అల్లర్లకు మోడీని నిందించలేము: శరద్ పవార్
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ కీలక భాగస్వామి శరద్ పవార్ బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి పరోక్షంగా తన మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తోంది. ఓ ఆంగ్ల చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పవార్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు, తర్వాత కూడా యూపీఏకు తాను చాలా సన్నిహితమని చెప్పారు. అంతేకాక మోడీతో తనకు మంచి సంబంధాలున్నాయని, రాజకీయ శత్రుత్వాన్ని తానెప్పుడు నమ్మనని కుండబద్దలు కొట్టారు.
2002 గుజరాత్ అల్లర్లకు మోడీని బాధ్యుడిగా చేయలేమని, అహ్మదాబాద్ లోని ప్రత్యేక కోర్టు అతనిని నిర్దోషిగా తేల్చిందని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించాలన్న పవార్ పదే పదే ఎందుకు ఆ అంశాన్ని లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. కాగా, జనవరిలో మోడీతో పవార్ రహస్యంగా భేటీ అయ్యారని, బీజేపీలోకి వెళుతున్నారని వచ్చిన వార్తలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, కలుసుకున్న మాట వాస్తమేనని ఆయన అన్నారు.
కానీ, రహస్యంగా జరిగింది కాదని, అధికారికంగా జరిగిన ఓ వ్యవసాయ కార్యక్రమానికి తాను (పవార్) అధ్యక్షత వహించగా, ఆయన (మోడీ) హాజరైనట్లు వెల్లడించారు. అది కేవలం ఓ చిట్ చాట్ మాత్రమేనని, దానికంత ప్రాధాన్యమివ్వాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు.