: క్రెడిట్ కార్డు కనీస సొమ్మును 90 రోజుల్లో కట్టాల్సిందే
క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక నెలలో తమ క్రెడిట్ కార్డులో సూచించిన సొమ్మును గడువులోగా చెల్లించకపోతే బ్యాంకులు వివిధ పద్ధతులను పాటిస్తున్నట్టు ఆర్బీఐ గుర్తించింది. ముఖ్యంగా కనీస మొత్తం బిల్లు రూపొందించిన తేదీ నుంచి లెక్క కట్టాలా? లేదా గడువు పూర్తయిన తేదీ నుంచి లెక్క కట్టాలా? అన్న అంశంపై రకరకాల పద్ధతులను బ్యాంకులు అనుసరిస్తున్నాయి. వడ్డీ, అపరాధ రుసుము... వంటి ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అలాగే కనీస సొమ్ము చెల్లించకపోతే దానిపై కూడా వడ్డీని వసూలు చేసే బ్యాంకులు ఉన్నాయి.
ఇప్పుడున్న పద్ధతులకు బదులుగా ఆర్బీఐ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతి నెలా వచ్చే బిల్లులో పూర్తి సొమ్ము కట్టేస్తే ఏ సమస్యా లేదు. అందులో పేర్కొన్న కనీస మొత్తం కూడా చెల్లించనప్పడు సమస్య వస్తుంది. ఇలాంటి సమయంలో ఇక నుంచి బిల్లు రూపొందించినప్పుడు ఏ గడువులోగా కనీస మొత్తం చెల్లించాలని పేర్కొంటారో, అదే గడువు తేదీన చెల్లించాలి. లేదా ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా సదరు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే దాన్ని నిరర్థక ఆస్తి (ఎన్.పి.ఓ)గా లెక్కిస్తారు. కనీస సొమ్ము పేర్కొన్న బిల్లుకు, తరువాత వచ్చే బిల్లు మధ్య వ్యత్యాసం 30 రోజులకు మించి ఉండకూడదు. అంటే ఒక బిల్లులోని మొత్తం తర్వాతి బిల్లులో జమ కాకూడదన్నమాట.