: క్షమించిన పోలీసు... ఊపిరి పీల్చుకున్న పాక్ క్రికెటర్
ఇటీవలే ఓ ట్రాఫిక్ పోలీసుపై దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణల మీద అరెస్టయి, బెయిల్ పొందిన పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు ఊరట. గత నెలలో ఉమర్ లాహోర్లో తన వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసు మహ్మద్ జీషన్ పై కలబడ్డాడు. దీనిపై అక్మల్ ను అరెస్టు చేయగా, అనంతరం బెయిల్ పై బయటికొచ్చాడు. అయితే, ఉమర్ తండ్రి ఇటీవలే జీషన్ కు కోర్టు వెలుపల క్షమాపణ తెలిపారు. దీంతో, క్రికెటర్ పై అభియోగాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఆ ట్రాఫిక్ పోలీసు తెలపడంతో కోర్టు కేసును కొట్టివేసింది.
ఉమర్ అక్మల్ 'నేషనల్ హీరో' అని, అందుకే అతడిని క్షమిస్తున్నానని జీషన్ పేర్కొన్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్ లో ఆఫ్ఘన్ తో కీలక మ్యాచ్ లో కష్టాల్లో ఉన్న పాక్ జట్టును ఉమర్ సెంచరీతో ఆదుకున్నాడు.