: తిరుపతిలో 'పాక శాస్త్ర యూనివర్సిటీ'కి కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన 'పాక శాస్త్ర యూనివర్సిటీ'కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో నెలకొల్పేందుకు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. భారతీయ పాక శాస్త్రానికి ఉన్న గుర్తింపు నేపథ్యంలో, మన దేశ విద్యార్థులతో పాటు విదేశీ విద్యార్థులకు కూడా ఇందులో ప్రవేశం ఉంటుంది. కోల్ కతా, ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో వర్సిటీ శాఖలు నెలకొల్పనున్నారు. ఆతిథ్య రంగంలో దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించిన క్రమంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతేగాక ప్రపంచస్థాయిలో వివిధ వంటకాల గురించి కూడా శాస్త్రీయ బోధన ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో సిలబస్ ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయించేందుకు కేంద్ర మంత్రి చిరంజీవి బాగా చొరవ చూపారని అంటున్నారు. పలుమార్లు దానిపై కేంద్రంతో చర్చలు జరపడం వల్లే ఇప్పుడు అనుమతి వచ్చినట్లు సమాచారం.