: మిస్సైన మలేషియా విమానం ఆ తర్వాత నాలుగ్గంటలు గాల్లోనే విహరించింది!
ఐదు రోజులు దాటుతున్నా ఆచూకీ లేకుండా పోయిన మలేషియా విమానం మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ విమాన ఘటనపై భిన్న కథనాలు వినవస్తున్నాయి. ఈసారి మాత్రం కచ్చిత డేటాతో అమెరికాలోని ‘వాల్ స్ట్రీట్’ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఎయిర్ ట్రాఫిక్ కంటోల్ (ఏటీసీ) రూమ్ తో సంబంధాలు తెగిపోయాక కూడా నాలుగు గంటల పాటు విమానం ప్రయాణించిందని తెలిసింది. అమెరికా దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే, అంతకు మించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన తరువాత సరిగ్గా ఒక గంటకు ఏటీసీతో మలేషియా విమానానికి లింక్ తెగిపోయింది. ఆ తరువాత నాలుగు గంటల పాటు అంటే సుమారు 2,530 మైళ్ల దూరం ఆ విమానం ప్రయాణించిందని రూఢి అయింది.
ప్రతి విమానానికి ఉండే ఇంజిన్ ను వాటి తయారీ సంస్థతో అనుసంధానం చేస్తారు. ఎప్పటికప్పుడు ఆ ఇంజిన్ నుంచి వివిధ అంశాలకు చెందిన డేటా ఆటోమేటిగ్గా తయారీ సంస్థకు వెళుతుంది. సముద్ర మట్టానికి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తోంది? ఎంత వేగంతో నడుస్తోంది? తదితర అంశాలకు చెందిన డేటా ఆటోమేటిగ్గా తయారీ కంపెనీకి పంపేలా ఓ అంతర్గత నిర్మాణ వ్యవస్థ ఆ ఇంజిన్ లో ఉంటుంది. ఆ విధంగా మాయమైన మలేషియా విమానం నుంచి ఐదు గంటల వరకు డేటా వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి విమానం బయలుదేరిన సమయం నుంచి ఇదీ గంటల వరకు ఇంజిన్లు పనిచేస్తున్నాయి. ఈ విమానాలను బోయింగ్ కంపెనీ తయారుచేసినా... ఇంజిన్లను రోల్స్ రాయిస్ కంపెనీ సరఫరా చేసింది. మలేషియా విమానంలో రెండు ట్రెంట్ 800 మోడల్ ఇంజిన్లు ఉన్నాయి. ఈ ఇంజిన్ల నుంచి వచ్చిన డేటాను దర్యాప్తు అధికారులకు ఇచ్చామని రోల్స్ రాయిస్ కంపెనీ అంటోంది. అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తోంది.
లింక్ తెగిపోయాక 2,500 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన ఆ విమానం ఎటు వైపు వెళ్లిందో తెలీదు కాబట్టి, ఆ విమానం భారత్ -పాక్ సరిహద్దు వరకు ప్రయాణం చేసి ఉండొచ్చనే అంచనాకు వస్తున్నారు. ఉత్తరాన బీజింగ్ వరకు, దక్షిణాన ఆస్ట్రేలియా వరకు కూడా ప్రయాణించి ఉండొచ్చు. అలాగే పశ్చిమాన పసిఫిక్ సముద్రం వరకు వెళ్లే అవకాశముంది. వీటి ఆధారంగా ఇపుడు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజా సమాచారం చూస్తుంటే... పైలెట్లు కానీ, వేరే వ్యక్తి కానీ కావాలని విమాన ట్రాన్స్ పాండర్లను ఆఫ్ చేసి... రాడార్ కు అందకుండా చేసి ఉంటారని భావిస్తున్నారు.
సాంకేతికపరమైన సమస్యలతో విమానం కూలిపోయే ఛాన్సే లేదని కూడా దర్యాప్తు అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. విమాన ఘటనలో తీవ్రవాదులకు సంబంధముందా? అన్న కోణాన్ని అమెరికా దర్యాప్తు అధికారులు ఒప్పుకోవటం లేదు. మరో వైపు మలేషియా ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అన్వేషణ సత్ఫలితాలనివ్వలేదు. ఇప్పుడిక ఈ విమానం నడుపుతున్న పైలెట్ల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. వీరిలో ఓ పైలెట్ చాలా చురుకైన వాడని తెలుస్తోంది.