: కంధమాల్ నన్ పై అత్యాచారం కేసులో ముగ్గుర్ని దోషులుగా ప్రకటించిన కోర్టు
2008లో సంచలనం సృష్టించిన కంధమాల్ నన్ పై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా ఈ రోజు ప్రకటించింది. ఆరుగురిపై నిందారోపణలను కొట్టివేసింది. 2008 ఆగస్టు 25న ఒడిశాలోని కంధమాల్ జిల్లా బాలిగూడలో క్రైస్తవ సన్యాసినిపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతకు రెండు రోజుల ముందే వీహెచ్ పీ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన అనుచరులు నలుగుర్ని హత్య చేయడంతో... జిల్లా వ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. అందులో భాగంగానే నన్ పై కొందరు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్నారు. 9 మందిని అరెస్ట్ చేయగా.. మరొక నిందితుడిని నేటికీ పట్టుకోలేకపోయారు. ఈ కేసు విచారణను హైకోర్టు ఆదేశాల మేరకు 2010లో కటక్ కోర్టుకు బదిలీ చేశారు. 29 మంది సాక్షులను విచారించిన అనంతరం జడ్జి ముగ్గురిని దోషులుగా ప్రకటించారు. వీరికి శిక్షలు ఖరారు చేయాల్సి ఉంది.