: పవన్ కల్యాణ్ ఇక ‘ఒక్కరే'!
ఈరోజు కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు సిద్ధమవుతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు ఒంటరి కానున్నారు. 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి, తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తాజాగా సీమాంధ్ర ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చిరంజీవి ఎన్నికైన విషయం విదితమే. చిరంజీవి సోదరుడైన పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడంపై మెగా కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చిరంజీవి తనయుడు రాంచరణ్ స్పందిస్తూ బాబాయ్ (పవన్ కల్యాణ్) పార్టీని స్వాగతిస్తానని, అయితే తన మద్దతు మాత్రం తండ్రికే అని తేల్చి చెప్పారు.
అలాగే, అన్నయ్య వెంటే మెగా కుటుంబం ఉంటుందని నాగబాబు ప్రకటించారు. తామీ రోజు ఈ స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తమ అన్నయ్యే కారణమని నాగబాబు వెల్లడించారు. దీంతో, మెగా కుటుంబంలో అందరూ చిరంజీవి వైపే మొగ్గు చూపడంతో, పవన్ కల్యాణ్ మాత్రం ‘ఒక్కరే’ తనదైన పంథాలో ముందుకెళుతున్నారు.