: నేడే విడుదల పవన్ కల్యాణ్ 'జనసేన'


సినీ నటుడు పవన్ కల్యాణ్ రాజకీయ తెరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి 'జనసేన' పేరుతో పార్టీని పార్టీ సిద్ధాంతాలను, తన రాజకీయ ఆలోచనల్ని అభిమానుల సమక్షంలో వెల్లడించనున్నారు. ఆయన పార్టీ ఏర్పాటు చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు, నేతల తీరుతెన్నులు అన్నింటిని వివరించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఇందులో భాగస్వాముల్ని చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. కొన్ని నగరాల్లో ప్రత్యక్ష ప్రచారం చేసే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సభలో పలువురు రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా సందడి చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించే ప్రారంభోత్సవ సభకు 6 వేల మందిని ఆహ్వానించగా, పోలీసులు 4 వేల మందికి మాత్రమే అనుమతిచ్చారు.

రాజకీయనాయకులకు, సినీ ప్రముఖులకు ఎలాంటి ఆహ్వానాలు పంపలేదు. 'జనసేన' పార్టీ ఏర్పాటు కోసం ఈ నెల 10న ఎన్నికల సంఘానికి పవన్ కల్యాణ్ దరఖాస్తు చేసుకున్నారు. బంజారాహిల్స్ లోని తన ఇంటిని చిరునామాగా అందులో పేర్కొన్నారు. మార్చి 3న కార్యవర్గ సమావేశం నిర్వహించినట్టు ఆయన ఎన్నికల సంఘానికి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాగా, కార్యదర్శి, కోశాధికారి, మరో ముగ్గురు కార్యవర్గ సభ్యులుగా వ్యవరిస్తారని ఎన్నికల సంఘానికి తెలిపారు.

సామాజిక, రాజకీయ పరమైన మార్పుకోసం, ప్రజల్లో వ్యవస్థ పట్ల నెలకొన్న అసహనాన్ని వెల్లడి చేసేందుకు జనసేన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించనున్నారు. గంటసేపు ప్రసంగించనున్న ఆయన పలు అంశాలను స్పృశించనున్నాడు. అయితే ఏఏ వర్గాలను టార్గెట్ చేయనున్నాడో సమాచారం లేదు. పవన్ సన్నిహితుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వేదికను రూపొందిస్తున్నారు. హైదరాబాదుకి చెందిన రాజేష్ అనే చిత్రకారుడితో పార్టీ లోగోను తయారు చేయించినట్టు తెలిసింది.

జెండా రంగు తెల్లగా ఉండగా, మధ్యలో ఎరుపు రంగు వృత్తాకారం, మధ్యలో స్టార్, ఎర్రటి చుక్క ఉన్నాయి. పార్టీ లోగో కూడా అదే. ఎరుపు రంగు విప్లవానికి, మార్పుకు సంకేతాలు కాగా, తెలుపు శాంతికి, వేల సంవత్సరాల భారతీయ నాగరికత, సంస్కృతికి చిహ్నం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నక్షత్రం తమ పార్టీ ఎంచుకున్న ఆరు ఆదర్శాలను గుర్తు చేస్తుందని వారు తెలిపారు. 'జనసేన' పార్టీ కోసం రెహమాన్ ఆనే సినీ గేయరచయిత పాట రాయగా శ్రీనివాస్ స్వరపరిస్తే, నరేందర్ గానం చేశారు.

పవన్ కల్యాణ్ పార్టీపై సోదరుడు చిరంజీవి స్పందించారు. 'ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే హక్కు, అధికారం, అవకాశం అందరికీ ఉందన్నారు. వ్యక్తిగతంగా పార్టీ పెట్టడం పవన్ ఇష్టం అని తెలిపారు'. కాగా 'తమ్ముడు పవన్ పార్టీ పెట్టినా తమకు గుర్తింపు తెచ్చిన అన్నయ్య చిరంజీవితోనే ఉంటానని' మరో సోదరుడు నాగబాబు స్పష్టం చేశారు. 'అభిమానులు కూడా అన్నయ్యతోనే పని చేస్తారని' ఆయన తెలిపారు.

పవన్ కల్యాణ్ పార్టీ వైఎస్సార్సీపీకే మేలు చేస్తుందని కాపునాడు ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టి వైఎస్సార్ కి మేలు చేస్తే, పవన్ పార్టీ పెట్టి జగన్ కి మేలు చేస్తున్నాడని వారు ఆరోపించారు. మరోవైపు 'పార్టీ పెట్టేందుకు పవన్ కి హక్కు ఉన్నా, అన్న పీఆర్పీ పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని' టీఆర్ఎస్ నేత కవిత డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News