: ఈ టాయిలెట్ ఉంటే నీళ్లతో పన్లేదు!
సమయానికి నీళ్లయిపోయాయి. మోటర్ వేద్దామంటే పవర్ కూడా లేదు. అర్జంట్ గా టాయిలెట్ కు వెళ్లాలి. ఎలా? ఆందోళన చెందకుండా ఇప్పడు మనం చెప్పుకోబోయే బయో టాయిలెట్ ను తెచ్చేసుకుంటే సరి, పరిష్కారం దొరికినట్లే. నీళ్లతో పన్లేదు. పనైపోయాక అదే క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది. ఈ అత్యద్భుతమైన ఉత్పత్తిని అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ప్రజలకు సరైన నీటి వసతి, పరిసరాల పరిశుభ్రత లేదు. ఇందుకు తగిన పరిష్కారం కనుగొనేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 2011 నుంచి పరిశోధనలకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. మొత్తం 16 పరిశోధక బృందాలు బిల్ అండ్ మిలిందా గేట్స్ సాయంతో బయో టాయిలెట్ కోసం శ్రమిస్తున్నాయి. ఇందులో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన ప్రొఫెసర్ లిండెన్ బృందం సోలాప్ పవర్ ఆధారంగా పనిచేసే చక్కటి టాయిలెట్ ను రూపొందించింది.
సూర్యరశ్మి సాయంతో మానవుల విసర్జితాన్ని ఈ టాయిలెట్ శుద్ధి చేసి దాన్ని బయో చెక్కగా మారుస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన లిండెన్ తెలిపారు. ఈ చెక్క పొలాల్లో సాగు ఉత్పత్తిని పెంచేందుకు, హానికారక కార్బన్ డై ఆక్సైడ్ కు కళ్లెం వేసేందుకు ఉపకరిస్తుందనేది ఆయన సూచన.
బిల్ అండ్ మిలిందా గేట్స్ సాయంతో 16 పరిశోధక బృందాలు రూపొందించిన టాయిలెట్లను ఈ నెల 20 నుంచి 22 వరకు ఢిల్లీలో ప్రదర్శించనున్నారు. ఇందులో సోలాప్ పవర్ టాయిలెట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.