: శిరోజాలను చూసి చెప్పేయొచ్చు మీ ఆరోగ్యం ఎలా ఉందో...!
తల వెంట్రుకలను పరిశీలించి కూడా మనిషి ఆరోగ్యాన్ని ఇట్టే చెప్పేయొచ్చంటున్నారు పరిశోధకులు. అసాధారణంగా శిరోజాలు రాలిపోతూ ఉంటే అది అనారోగ్యానికి తొలి సంకేతమని వారు అంటున్నారు. చిట్లిపోయినట్టుండే జుత్తు, కాంతి విహీనంగా ఉన్న శిరోజాలు, పొడి బారినట్టుంటే కేశాలు ఇలా ఒక్కో రకంగా ఉండే తల వెంట్రుకలు ఒక్కొక్క లోపానికి చిహ్నాలని, ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయరాదని పరిశోధకులు సూచించారు.
వెంట్రుకలు పొడిబారినట్టుంటే అది ప్రొటీన్, విటమిన్ ఏ, జింక్, ఫాటీ యాసిడ్లు లోపించినట్టని... జుత్తు జిడ్డుగా తయారైతే జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6 తక్కువైనట్టని భావించాల్సి ఉంటుందట. ఇక, జుత్తు ముతకగా ఉంటే ప్రొటీన్, విటమిన్ ఏ లోపమని, ఇది హైపోథైరాయిడిజానికి దారితీస్తుందని హెచ్చరించారు. కేశాల చివర్లు చిట్లిపోతే అది ఎనీమియా (రక్తహీనత), ఐరన్, విటమిన్ బి6, మెగ్నీషియం, రాగి, ఫోలిక్ యాసిడ్ వంటి ధాతువుల లోపంగా భావించాల్సి ఉంటుందట.