: ఏసీ టికెట్ కొనుక్కుని వెళితే జనరల్ బోగీ ఎదురైంది!
బీహార్ రాజధాని పాట్నాలోని కాంకార్ భాగ్ ప్రాంతానికి చెందిన సంజయ్ కుమార్ అనే వ్యక్తి దనాపూర్-సాహెబ్ గంజ్ ఇంటర్ సిటీ రైల్లో దనాపూర్ వెళ్ళేందుకుని ఎసీ చైర్ కార్ టికెట్ తీసుకున్నాడు, ముందస్తుగానే. ఇక అతను ప్రయాణం చేయాల్సిన రోజు రానే వచ్చింది. లగేజి సర్దుకుని రైల్వే స్టేషన్ కు వెళ్ళి ప్లాట్ ఫామ్ పై నిలుచున్నాడు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ఏసీ చైర్ కార్ ఎంత వెదికినా కనిపించకపోవడంతో సంజయ్ హతాశుడయ్యాడు.
దీనిపై టీటీఈని వివరణ కోరగా ఆయన చెప్పిన సమాధానం విని మరింత షాక్ కు గురయ్యాడీ బీహారీవాలా. గత పది రోజులుగా ఈ ట్రైన్ కు ఏసీ బోగీలు కనెక్ట్ చేయడంలేదని టీటీఈ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సంజయ్ తో పాటు ఏసీ చైర్ కార్ టికెట్లు తీసుకున్న ఇతర ప్రయాణికులు కూడా టీటీఈపై మండిపడ్డారు. ఇక కొందరు ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదావేసుకోలేక జనరల్ బోగీలతో సర్దుకుపోయారు. ఈ వ్యవహారంపై రైల్వే శాఖ స్పందిస్తూ, మార్చి 15 వరకు సదరు ఎక్స్ ప్రెస్ కు ఏసీ టికెట్లు బుక్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.