: చరణ్ ని చూస్తే 'చిరు' అసూయట!
టాలీవుడ్ లో 'మగధీర'తో బాక్సాఫీసు రికార్డులను షేక్ చేసిన రామ్ చరణ్ తేజ్ పై చిరంజీవి అసూయపడుతున్నారట. ఈ విషయం స్వయంగా మెగాస్టారే చెప్పడం విశేషం. విషయం ఏంటంటే, చరణ్ బాలీవుడ్ అరంగేట్రం మూవీ 'జంజీర్' తెలుగు వెర్షన్ 'తుపాన్' ట్రైలర్ ను నేడు హైదరాబాద్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా వేదికపై చిరంజీవి మాట్లాడుతూ, చరణ్ లాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉంది అంటూనే, తనను మించి పోతుండడం పట్ల కించిత్ ఈర్ష్యగానూ ఉందని చెప్పుకొచ్చారు. తాను హిందీలో నటించిన తొలి చిత్రం ప్రతిబంధ్ అని, ఆ సినిమాలో నటించడానికి 13 ఏళ్ళు ఎదురుచూడాల్సి వచ్చిందని, అదే రామ్ చరణ్ కెమెరా ముందుకొచ్చిన మూడేళ్ళకే 'జంజీర్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడంటూ తన అసూయకు కారణం వెల్లడించారు.
ఏదేమైనా, చరణ్ తన కొడుకు కాబట్టి చాలా మితంగా మాట్లాడుతున్నానని చిరు చెప్పాడు. చరణ్ తన కుమారుడు అయినందుకు గర్విస్తున్నానంటూ, 'జీవితంలో నేనేదైనా సాధించానూ అంటే, అది రామ్ చరణ్ నే' అని ఉద్వేగపూరితంగా అన్నారు. ఇక ఈ సినిమా గురించి చెబుతూ, 'తుపాన్' అందర్నీ అలరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నటన పరంగా చరణ్ ఓ మెట్టు పైకెదిగాడని ఈ సినిమాతో నిరూపితమవుతుందని చిరు అన్నాడు.
ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ, నాన్న పేరుకు తగిన విధంగా నటించేందుకు ఎంతో కష్టపడ్డానని చెప్పాడు. తొలుత అపూర్వ లఖియా ఈ సినిమా అవకాశం గురించి చెప్పినపుడు, అమితాబ్ లాంటి దిగ్గజం చేసిన సినిమాలో నటించేందుకు భయం వేసిందని వెల్లడించాడు. అయితే, తన తండ్రి ప్రోత్సాహం మేరకు ముందంజ వేసినట్టు ఈ మెగా తనయుడు చెప్పాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా, శ్రీహరి, దర్శకుడు అపూర్వ లఖియా తదితరులు హాజరయ్యారు.