: చచ్చిన గురువు బతికొస్తాడంటున్న మూర్ఖ శిష్యులు!
గురువు చచ్చాడని వైద్యులు ప్రకటించినా, బతికొస్తాడంటూ కొందరు మూర్ఖ శిష్యులు ఆయన శవాన్ని ఫ్రీజర్ లో భద్రపరిచిన వైనం విస్తుగొలుపుతోంది. వివరాల్లోకి వెళితే... పంజాబ్ లోని నూర్ మహల్ ప్రాంతంలో అశుతోష్ మహరాజ్ అనే బాబాను ప్రజలు విశేషంగా నమ్మారు. ఆయన కూడా ఇతోధికంగా ప్రజలను నమ్ముకుని ఆస్తులు బాగానే కూడబెట్టాడు. 'దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్' పేరిట ప్రపంచవ్యాప్తంగా శిష్య బృందాన్ని తయారుచేసుకున్నాడీ స్వయంప్రకటిత అవతరాపురుషుడు. ప్రజలను బురిడీ కొట్టించాలంటే ఈ మాత్రం బిల్డప్ అవసరం కదా. అయితే, కాలం కలసిరాక కాస్త ముందే పోవాల్సి వచ్చింది.
70 ఏళ్ళ ఈ మహరాజ్ స్వామీజీ గత జనవరి 29న పరమాత్మలో ఐక్యం అయ్యారట! ఇది భక్తకోటి అభిప్రాయం. సామాన్య జన పరిభాషలో చెప్పుకోవాలంటే... 'పోయాడు'! కానీ, ఆయన శిష్యులు మాత్రం తమ గురువు మళ్ళీ సజీవుడిగా తిరిగొస్తాడంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. అంతేగాకుండా, ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్ లో భద్రపరిచారు కుళ్ళిపోకుండా. భక్తులకు మాత్రం స్వామి ధ్యానముద్రలో ఉన్నాడని చెబుతూ నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందనీ, తామేమీ జోక్యం చేసుకోలేమని సీనియర్ పోలీసు అధికారి గురీందర్ సింగ్ థిల్లాన్ చెప్పారు.