: దేవయానిపై అభియోగాలను కొట్టేసిన అమెరికా కోర్టు
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదేపై వీసా మోసం కేసులో అభియోగాలను అమెరికాలోని స్థానిక కోర్టు కొట్టేసింది. న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్న సమయంలో దేవయాని తన ఇంట్లో పనిమనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది డిసెంబర్ 12న కేసు నమోదైన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆమెను అమెరికా తమ దేశం నుంచి బహష్కరించిన విషయం విదితమే. ఈ కేసులో దేవయానిపై జనవరిలో అభియోగాలను నమోదు చేశారు. అయితే, అదే నెల 8వ తేదీన దేవయానికి పూర్తి దౌత్యరక్షణను మంజూరు చేసినందున ఆమెపై కేసును కొట్టివేస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో దౌత్యరక్షణ లేకున్నా.. తర్వాత ఆమె దాన్ని పొందినందున ఆమెపై అభియోగాలను కొట్టివేయక తప్పడం లేదన్నారు.