: మహిళతో జైలు నుంచి తరుణ్ తేజ్ పాల్ మొబైల్ ఫోన్ సంభాషణ
లైంగిక ఆరోపణల కేసులో జైలు పాలైన తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్... జైలు నుంచే ప్రతిరోజూ ఓ మహిళా వ్యాపార భాగస్వామితో ఫోన్ లో సంభాషించేవారని విచారణలో తేలింది. జైలు అధికారులు ఈ నివేదికను మర్గావో జిల్లా, సెషన్స్ కోర్టుకు ఈరోజు సమర్పించారు. తేజ్ పాల్ జైలు గది నుంచి సిమ్ ను సీజ్ చేసినట్టు జైలు అధికారులు చెప్పారు. ఈ సిమ్ పనాజీకి చెందిన ఓ మహిళ పేరుతో తీసుకున్నారు. తేజ్ పాల్ ఢిల్లీకి చెందిన షీలా లుంకడ్ అనే మహిళతో మాట్లాడినట్టు జైలు అధికారులు తెలిపారు. షీలాతో పాటు ఢిల్లీకే చెందిన మంజరితోనూ సంభాషించేవారని, ఆయన సిమ్ లో ఇతర ఫోన్ నెంబర్లు ఉన్నట్లు వారు గుర్తించారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేజ్ పాల్, ఆయన భార్య గీతన బత్రా, షీలా, రాజీవ్ లుకండ్ భాగస్వాములు. జైల్లోకి సెల్ ఫోన్ ను ఎలా అనుమతించారనే కోణంలో జైలు అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.