: ఘోరం.. దారుణం.. చెత్త.. పరమ చెత్త: క్లార్క్ సేనపై ఆసీస్ మీడియా గరం గరం


భారత పర్యటనలో క్లార్క్ సేన 0-4తో చిత్తుగా ఓటమిపాలవడం పట్ల ఆసీస్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. ఆటగాళ్ళు 'పరమచెత్త'గా ఆడారంటూ పతాకశీర్షికలతో విరుచుకుపడ్డాయి. అంతేగాకుండా, 34 ఏళ్ళలో ఇదే 'అత్యంత చెత్త ఆసీస్ క్రికెట్ జట్టు' అని తీర్మానించేశాయి. భారత బౌలర్ల ధాటికి వెర్రి వెంగళప్పల్లా తలలు వేలాడేసుకుని తిరిగి వచ్చారని విమర్శల వర్షం కురిపించాయి.

ఈ క్రమంలో 'ద టెలిగ్రాఫ్' పత్రిక.. 'భారత్ లో దారుణ ఆటతీరు కనబర్చడం ద్వారా అపఖ్యాతిని మూటగట్టుకుని స్వదేశానికి వచ్చారు. ఈ ఘోరపరాభవం ఇప్పుడు అధికారికం' అని పేర్కొంది. ఇక 'హెరాల్డ్ సన్' అయితే, ఆసీస్ బ్యాట్స్ మన్ తాము చెత్తగా ఆడి మంచి ఫలితాలు ఆశించామని చెప్పడం వెర్రితనానికి సరికొత్త నిర్వచనం ఇవ్వడమేనని కటువుగా వ్యాఖ్యానించింది.

కాగా, మూడు రోజుల్లోనే ముగిసిన ఢిల్లీ టెస్టులో ఓటమికి ఆసీస్ పత్రికలన్నీ షేన్ వాట్సన్ ను వేలెత్తి చూపాయి. 'ఈ టూర్లో ఎవరి ఫామ్ నైనా ప్రశ్నించాలనుకుంటే అది వాట్సన్ దే'  అని టెలిగ్రాఫ్ పేర్కొంది. భారత్ తో చివరి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ క్లార్క్ గైర్హాజరీలో వాట్సన్ ఆసీస్ జట్టుకు సారథ్యం వహించిన సంగతి తెలిసిందే.

ఆ మ్యాచ్ లో ఓజా బౌలింగ్ లో వాట్సన్ నిర్లక్ష్యంగా ఆడి అవుటవడాన్ని 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' తప్పుబట్టింది. నాయకత్వం వహించే వ్యక్తి ఆడాల్సిన తీరు అది కాదని హితవు పలికింది. 

  • Loading...

More Telugu News