: అజహర్, మొయిలీ అభ్యర్థిత్వాలు తేలేది నేడే
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ అజహరుద్దీన్, కేంద్ర మంత్రి మొయిలీ లోక్ సభ అభ్యర్థిత్వాలు నేడు తేలనున్నాయి. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు సమావేశమవుతోంది. ఇందులో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయనున్నారు. మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే త్వరలో జరిగే ఎన్నికలలో పశ్చిమబెంగాల్ నుంచి పోటీ చేయనున్నారు. ఏ నియోజకవర్గం నుంచి అజహర్ ను బరిలోకి దింపాలన్న దానిపై నేటి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన స్థానంపై కూడా నేటి సమావేశంలో స్పష్టత రానుంది. కాంగ్రెస్ 194 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. త్వరలో రెండో జాబితా విడుదల చేయనుంది.