: నాలుగేళ్ల బుడ్డోడు.. ఇంటి దొంగగా మారాడు!
ఆ బుడతడి వయస్సు నాలుగు సంవత్సరాలే. ఇంట్లో వాళ్లు చెప్పింది విని బుద్ధిగా తరగతిలో పాఠాలు నేర్చుకోవాల్సిన వయస్సు అది. అలాంటిది, పిన్న వయస్సులోనే చెడు మార్గం పట్టి.. ఇంటి దొంగగా మారితే కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. ఈ తరహా ఘటనే చైనా రాజధాని బీజింగ్ కు సమీపంలోని షియాంగ్ లో చోటు చేసుకొంది. ఇంట్లో వాళ్ల కళ్లుగప్పి ఆ బుడతడు 3,264 డాలర్లను కాజేశాడు. స్నేహితులతో కలిసి జూదం ఆడేందుకు ప్లాన్ చేసుకున్న ఆ బాలుడు ఆ డాలర్లను తన స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
గతవారం ఇచ్చిన హోంవర్క్ ను పరిశీలించేందుకు టీచర్ ఆ బ్యాగ్ ను తీయగా... పెద్ద మొత్తంలో ఉన్న ఆ సొమ్ము బయటపడింది. దీంతో నివ్వెరపోయిన ఆ టీచర్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. తన స్నేహితులతో కలిసి గాంబ్లింగ్ ఆట ఆడేందుకు డాలర్లను తానే ఇంట్లో నుంచి అపహరించినట్లు బాలుడు స్కూల్ యాజమాన్యానికి తెలిపాడు. దీంతో వారు ఆ బాలుని తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. వ్యాపార పనుల్లో భాగంగా దాచి ఉంచిన ఆ డబ్బును తనయుడు దొంగిలించడంతో తల్లి దిగ్భ్రాంతికి గురైంది.