: బాబు చెప్పాడు.. పయ్యావుల పాటించాడు
అసెంబ్లీలో ఈరోజు టీడీపీ సభ్యులు లేవనెత్తిన విద్యుత్ సంక్షోభం అంశం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టిందనడంలో ఎలాంటి సందేహంలేదు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్.. సర్కారు తీరును ఎండగట్టడంతో.. సమాధానం చెప్పుకునేందుకు సీఎం కిరణ్ తో పాటు పీసీసీ చీఫ్ బొత్స కూడా నానా తంటాలు పడ్డారు. ఓ దశలో వీరిరువురు కొంచెం అసహనానికి లోనైనట్టు కనిపించింది కూడా.
సీఎం.. కాగ్ నివేదికకు పవిత్ర గ్రంథాలతో పోలిక పెట్టే ప్రయత్నం చేయడం.. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్ర స్థాయిలో ఉందని బొత్స అంగీకరించాల్సి రావడం.. ఓ రకంగా టీడీఎల్పీ విజయమే అనవచ్చు. అయితే, టీడీపీ సభ్యులు ఇంతలా విరుచుకుపడడానికి కారణం అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహాలే కారణమని తెలుస్తోంది.
ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న బాబు ఈ ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో చర్చించారట. విద్యుత్ సమస్యపై చర్చకు పట్టుబడితే, సర్కారు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని, అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికా అవకాశం ఇవ్వొద్దని బాబు టీడీఎల్పీ నాయకులకు సూచించారు. ఈ క్రమంలో ప్రభుత్వ వాదనలను దీటుగా ఎదుర్కోవాలని కూడా ఆయన చెప్పారట.