: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఆటో డ్రైవర్


అతని పేరు సంతోష్ గైక్వాడ్. వృత్తి ఆటో డ్రైవర్, ప్రవృత్తి వికలాంగులకు సేవ చేయడం. సరిగ్గా ఈ సేవాగుణమే అతడికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిపెట్టింది. నవీ ముంబయిలోని ఘన్సోలి ప్రాంతంలో సంతోష్ పేరు చెబితే ఎవరైనా గుర్తు పడతారు. వికలాంగులను తన ఆటోలో ఎంత దూరమైనా ఉచితంగానే తీసుకెళతాడు. గతంలో సంతోష్ బామ్మకు క్యాన్సర్ కారణంగా కాలు తీసేశారు. అనంతరం ఒంటి కాలుతో ఆమె పడిన బాధ సంతోష్ ను కదిలించి వేసింది. అప్పటి నుంచి వికలాంగులు ఎవరైనా తన ఆటో వద్దకు వస్తే వారి నుంచి పైసా తీసుకోకుండా వారెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళేవాడు. గత దశాబ్దం నుంచి అతని సేవా పంథాలో ఎలాంటి మార్పు రాలేదు.

ఇక తమ సహచరుడి స్ఫూర్తిగా మరో 50 మంది ఆటో డ్రైవర్లు కూడా వికలాంగులను ఉచితంగా తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సంతోష్ సేవలను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు గుర్తించారు. అతనికి తమ రికార్డ్స్ పుస్తకంలో స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. సంతోష్ సేవలను అంధేరి ప్రాంతీయ రవాణా కార్యాలయం అధికారులు కూడా గుర్తించారు. ఇటీవలే అతడిని ఘనంగా సత్కరించారు.

  • Loading...

More Telugu News