: ఐరిష్ క్రికెట్ లీగ్ లో లాలా అమర్ నాథ్ మనుమడు
భారత్ తొలి తరం క్రికెటర్లలో లాలా అమర్ నాథ్ ముఖ్యులు. ఆయన కుమారులు సురిందర్ అమర్ నాథ్, మొహిందర్ అమర్ నాథ్ కూడా క్రికెటర్లే. ఇప్పుడు వారి కుటుంబం నుంచి మరో వారసుడు క్రికెట్ బరిలో దిగాడు. సురిందర్ కుమారుడైన దిగ్విజయ్ తాజాగా ఐరిష్ క్రికెట్ లీగ్ లో నార్తర్న్ ఐర్లాండ్ జట్టు బ్రిగేడ్ సీసీ తరపున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
చెన్నయ్ లోని ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లో శిక్షణ పొందిన దిగ్విజయ్ ఇటీవలే శ్రీలంకలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. నాలుగు మ్యాచ్ లాడిన ఈ యువ బ్యాట్స్ మన్ 140 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లో 62 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. కాగా, ఐరిష్ లీగ్ కు ఎంపికవడంపై దిగ్విజయ్ మాట్లాడుతూ, ఇంగ్లిష్ వాతావరణంలో క్రికెట్ ఆడనుండడం భిన్నమైన అనుభవమని పేర్కొన్నాడు.