: ఎన్నికల ప్రత్యర్థులను గ్లామర్ తో చిత్తుచేస్తానంటున్న బాలీవుడ్ నటీమణి
పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగుతున్న బాలీవుడ్ అలనాటి అందగత్తె మూన్ మూన్ సేన్ తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. గ్లామర్ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనుకుంటే తప్పకుండా తన గ్లామర్ తో ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు యత్నిస్తానని సేన్ తెలిపింది. ఎన్నికలనేసరికి ప్రతి ఒక్కరూ గ్లామర్ గురించి మాట్లాడతారని, రాజకీయాల్లో అది కొత్తేమీ కాదు కదా? అని పేర్కొంది. భారత రాజకీయాలను శాసిస్తున్న ఇటాలియన్ (సోనియా), తమిళనాడు సీఎం జయలలిత రాజకీయాలకు గ్లామర్ సొబగులు అద్దినవారేనని సేన్ వివరించారు.
తానిప్పుడు బంకురా నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్నానని చెప్పిన మూన్ మూన్ సేన్, అక్కడ తన ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ బాసుదేబ్ ఆచార్య వయసు 75 ఏళ్ళని, ఆయనతో పోటీ సందర్భంగా తప్పకుండా తన గ్లామర్ మంత్రం ప్రయోగిస్తానని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఈమె విశ్వనాథ్ రూపొందించిన 'సిరివెన్నెల' సినిమాలో నటించింది. అలాగే, తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించిన రైమా సేన్ ఈవిడ కుమార్తే. మరో తనయ రియా సేన్ హిందీ చిత్రాలకే పరిమితమైంది.