: ఉక్రెయిన్ ప్రధానితో భేటీ కానున్న ఒబామా
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య ఏర్పడిన వివాదంలో ప్రత్యక్ష జోక్యానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆర్సెనీ యత్సెన్యుక్ తో బుధవారం భేటీ కానున్నారు. తద్వారా ఉక్రెయిన్ తాజా ప్రభుత్వానికి తమ గుర్తింపు ఉందన్న విషయాన్ని రష్యాకు చాటనున్నారు. మార్చి 16న క్రిమియా అంశంలో రిఫరెండానికి రష్యా సిద్ధమవుతోంది. ఆ ప్రాంత ప్రజలు ఉక్రెయిన్ లో ఉండాలో? వద్దో? తేల్చుకునేందుకు ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. ఈ చర్య పట్ల ఉక్రెయిన్ ప్రధాని యత్సెన్యుక్ స్పందిస్తూ, ఒక్క సెంటిమీటర్ స్థలాన్ని కూడా జారవిడుచుకోబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచిన అమెరికా... రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడంలో ముందుకు వెళుతోంది. ఇప్పటికే పలు దేశాలు బహిరంగంగానే రష్యా చర్యను దునుమాడాయి. ఈ క్రమంలో బుధవారం యత్సెన్యుక్ తో ఒబామా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.