: జాతీయ క్రికెటర్ ను చితకబాదిన పోలీసు
టీమిండియా తరపున కొన్ని మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ పేసర్ పర్వీందర్ అవానాను నోయిడా పోలీసు కానిస్టేబుల్ చితకబాదాడు. నోయిడాలోని గ్రేట్ ఇండియా ప్లేస్ మాల్ వద్ద ఓ ఫోన్ కాల్ మాట్లాడేందుకు అవానా తన కారును నిలిపాడు. దీంతో అక్కడికివచ్చిన భగత్ సింగ్ యాదవ్ అనే కానిస్టేబుల్ అవానాతో వాగ్వివాదానికి దిగాడు. కాల్ మాట్లాడి కారు తీస్తానని చెప్పినా వినకుండా అవానాపై పిడిగుద్దుల వర్షం కురిపించాడా దుందుడుకు కానిస్టేబుల్. మెడపై పదేపదే కొట్టడంతో తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైపోయిందని అవానా ఆ తర్వాత మీడియాకు తెలిపాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా భగత్ సింగ్ యాదవ్ ను సస్పెండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ ను నమోదు చేయలేదు.