: భార్యని పట్టించుకోని వ్యక్తి దేశాన్ని ఉద్ధరిస్తాడా?: మోడీపై డిగ్గీ వ్యాఖ్య
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ తన విమర్శల దాడిని తీవ్రం చేసింది. భార్యను పట్టించుకోని వ్యక్తి దేశాన్నెలా ఉద్ధరిస్తారని ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'తన హృదయంలో మహిళల పట్ల ఏమాత్రం గౌరవమున్నా, ఎన్నికల ఫారంలో 'భార్య' అన్న కాలమ్ ను ఎందుకు ఖాళీగా వదిలేస్తాడు? తానసలు పెళ్ళే చేసుకోలేదని గానీ, భార్యను వదిలేశానని గానీ మోడీ ఎందుకు చెప్పుకోడు? పాపం, జశోదాబెన్ (మోడీ భార్య అని మీడియా పేర్కొంటున్న వ్యక్తి) ఓ అద్దె కొంపలో బతుకీడుస్తోంది. ఆమెకు ఓ బంగ్లా, ఇతర సౌకర్యాలు ఎందుకు కల్పించడు మోడీ? ఈయనో పెద్దమనిషి! ఈయన దేశాన్ని సంరక్షిస్తాడట!' అంటూ డిగ్గీ రాజా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.