: బంగారం అక్రమ రవాణా... దిగుమతి సుంకం తగ్గించే యోచనలో కేంద్రం
దేశంలో దొంగ బంగారం పెరిగిపోతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దేశంలోని ఏదో ఒక ఎయిర్ పోర్టులో అక్రమంగా తీసుకువస్తున్న బంగారాన్ని ప్రతిరోజూ కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. ఒక్క శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే గతేడాది అక్టోబరు నుండి డిసెంబరు వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. గడచిన ఫిబ్రవరి నెలలో కూడా పదికి పైగా పుత్తడి పట్టివేత కేసులు శంషాబాదులో నమోదయ్యాయి. సుమారు పది కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పాప్ కార్న్ యంత్రం, షూ సాక్సుల్లో, లో దుస్తుల్లో లగేజీ బ్యాగులకు డిజైనింగ్ తీగల మాదిరిగా, చివరకు కండోమ్స్ లో కూడా.. ఇలా రకరకాలుగా ప్రయాణికులు విదేశాల నుంచి బంగారాన్ని తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోతున్నారు. కోచి ఎయిర్ పోర్టులో లిక్విడ్ గోల్డ్ ను కండోమ్ లో అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల సింగపూర్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి రెండు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారంపై ఆంక్షలు పెరగటంతో శంషాబాద్ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా బంగారం అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం దిగుబడులపై ఆంక్షలు తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. పూర్తిగా కాకపోయినా, కొంత మేరకైనా దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం బంగారంపై సుంకం 10 శాతంగా ఉంది. దీనిని సగానికి తగ్గిస్తే బంగారం ధర 5 శాతం వరకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర రూ. 1500 వరకు తగ్గే అవకాశం ఉంది.