: రాహుల్ చరిత్ర పాఠాలు నేర్చుకోవాలి: బీజేపీ
ఆర్ఎస్ఎస్ వాదులే మహాత్మా గాంధీని చంపారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఘాటుగా స్పందించింది. రాహుల్ మొదట చరిత్ర పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికింది. బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, చరిత్రపై రాహుల్ కు పెద్దగా అవగాహన లేనట్టుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ సహచరుల నుంచైనా ఆయన చరిత్రకు సంబంధించిన అంశాలను తెలుసుకోవాలని నక్వీ సూచించారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని కూడా ఆయన వెల్లడించారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి త్రివేంద్ర సింగ్ రావత్ కూడా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటలని కొట్టిపారేశారు.