: స్మోకింగ్ చేస్తారా... అయితే గాయాలు మిమ్మల్ని వదలవు!
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ ... అంటూ శపించాడు కన్యాశుల్కంలో గిరీశం మహానుభావుడు. అది ఆయన కాలానికి చెల్లిందేమో కానీ, నేటి కాలానికి మాత్రం కుదరనేకుదరదు అంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా, 'గిరీశంగారి మాటలు పట్టించుకుని పొగ తాగడానికి అలవాటు పడ్డారో ... ఇక మీ పని అంతే' అని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, పొగతాగే అలవాటున్న వాళ్ళలో గాయాలు త్వరగా మానవట!
ఏవైనా దెబ్బలు తగిలినా ... ఆపరేషన్లు చేయించుకున్నా పొగతాగే వారు ఆ గాయాల బారి నుంచి త్వరగా బయటపడలేరట. అమెరికాలో జరిగిన ఓ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పొగతాగని వారికన్నా ... తాగేవారిలో ఈ గాయాల మాన్పు అనేది పెద్ద సమస్యగా మారిందని ఈ అధ్యయనం తెలిపింది. కాబట్టి, ఆపరేషన్ల సమయంలో రోగికి పొగతాగే అలవాటు ఉందా? అనేది ముందుగానే తెలుసుకోవాలని వైద్యులను అప్రమత్తం చేస్తున్నారు.