: జూన్ 2న అపాయింటెడ్ డేనే కాదు... ఇటలీ రిపబ్లిక్ డే: చంద్రబాబు
హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో గల్లా అరుణ, గల్లా జయదేవ్ టీడీపీలో చేరిన అనంతరం ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గల్లా అరుణ, జయదేవ్ సహా తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్తలు, నాయకులను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రజాసేవ ఎలా చేయాలో చేసి చూపిన వ్యక్తి రాజ్ గోపాల్ నాయుడు అని చంద్రబాబు అన్నారు. మూడు తరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కుటుంబం ఈరోజు ఆ పార్టీని పూర్తిగా వీడి టీడీపీలోకి వచ్చిందని, దీన్ని బట్టి కాంగ్రెస్ విధానాలను అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిపోయిందని ఆయన చెప్పారు. జూన్ 2వ తేదీన అపాయింటెడ్ డే గా ప్రకటించారని, కానీ వాస్తవానికి ఆరోజు ఇటలీ దేశానికి రిపబ్లిక్ డే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోరుకున్న వాళ్లు కూడా సీమాంధ్రకు అన్యాయం జరగాలని అనుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణలో పునర్నిర్మాణం, సీమాంధ్రలో అభివృద్ధి జరగాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.