: వయసు 29 ఏళ్లు... చేసిన ఉద్యోగాలు 28
కూటి కోసం కోటి తిప్పలు గురించి తెలుసు. కానీ, ఇతను కూటి కోసం కాదు.. ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకున్నాడు. చెన్నైలో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేశాడు భువనేశ్వర్ కు చెందిన 29 ఏళ్ల జుబనశ్వమిశ్ర. బాగా ఆలోచించిన తర్వాత 2013 మేలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాడు.
దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేశాడు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఉద్యోగం. అదీ, వారం పాటు. అంటే 28 వారాల్లో 28 రాష్ట్రాల్లో 28 ఉద్యోగాలను దిగ్విజయంగా చేసేశాడు. అతడు చేసిన ఉద్యోగాల్లో ఫొటోగ్రాఫర్, టీచర్, సినిమా సహాయకుడు, ఎమోషనల్ సపోర్ట్ కన్సల్టెంట్, కాటి కాపరి తదితర పనులు ఉన్నాయి. అన్నింటి కంటే ముందు అసోంలో టీ అమ్మే ఉద్యోగాన్ని నిర్వహించాడు. నాగాలాండ్ లో హార్డ్ వేర్ షాపులో హెల్పర్ గా పనిచేశాడు.
ఎందుకిలా? అని మీడియా జుబనశ్వమిశ్రను ప్రశ్నించింది. పెద్దల ఒత్తిడితో పిల్లలు ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులకే పరిమితం అవుతున్నారు. దాంతో వారి కలలు నెరవేరకుండానే పోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని ప్రోత్సహించేందుకే ఈ పనులు చేశానని చెప్పాడు.