: దక్షిణ కొరియాకు బహుమానంగా బోధి వృక్షం
బౌద్ధులు పవిత్రంగా భావించే బోధి వృక్షాన్ని (రావి చెట్టు) భారత్ దక్షిణ కొరియాకు బహుమానంగా అందించింది. దక్షిణ కొరియా జనాభాలో పావు శాతం వరకు బౌద్ధులే ఉన్నారు. ఈ నేపథ్యంలో బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బీహార్లోని గయ పట్టణం నుంచి ఒక బోధి వృక్షాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ దక్షిణ కొరియాకు బహుమతిగా పంపారు. ఈ ఏడాది జనవరిలో భారత పర్యటనకు వచ్చిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హైకు... ఇరు దేశాల స్నేహ బంధానికి గుర్తుగా బోధి వృక్షాన్ని బహుమానంగా ఇస్తానని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. ఆ మేరకు విదేశాంగ శాఖ అధికారులు, దక్షిణ కొరియా అటవీ అధికారులు కలసి ప్రత్యేక విమానంలో శుక్రవారం సియోల్ కు బోధి వృక్షాన్ని తీసుకెళ్లారు. దీన్ని కొరియా జాతీయ ఉద్యానవనంలో తాత్కాలికంగా ఉంచనున్నారు. ఆ తర్వాత ఒక శాశ్వత ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు.