: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ విధానానికి నిరసనగానే రాజీనామా చేశా: ఫురంధేశ్వరి
ఢిల్లీలో మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి భారతీయ జనతాపార్టీ (బీజేపీ)లో చేరిన సందర్భంగా ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్య నాయుడును కలుసుకున్నారు. అనంతరం ఆయన నివాసంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) బీజేపీ అగ్రనేతలను అందరినీ కలిసినట్లు ఆమె చెప్పారు. తొలుత రాజకీయాల నుంచి విరమించుకోవాలని అనుకొన్నానని, అయితే మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాతోనే జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఆమె చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాను కోరుకున్నానని ఆమె అన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానానికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆమె స్పష్టం చేశారు. అందుకే లోక్ సభలో బిల్లు పాస్ కాగానే రాజీనామా చేశానని పురంధేశ్వరి చెప్పారు.