: ‘సహారా’ ప్రతిపాదనను తిరస్కరించిన ‘సుప్రీం’... సుబ్రతోరాయ్ విడుదలకు ససేమిరా
మదుపరులకు చెల్లించాల్సిన సొమ్మును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తానన్న సహారా గ్రూప్ సంస్థల అధినేత సుబ్రతోరాయ్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుబ్రతోరాయ్, మరో డైరెక్టర్ విడుదలకు కూడా కోర్టు అంగీకరించలేదు. మార్చి 11వ తేదీన జరిగే కోర్టు తదుపరి విచారణ వరకూ రాయ్ జైల్లోనే ఉండాలని ‘సుప్రీం’ ఆదేశించింది. అయితే రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రాయ్ ను కన్సల్టెంట్లు, న్యాయవాదులు కలిసేందుకు సుప్రీం అనుమతినిచ్చింది.
మదుపరులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్ల రూపాయల్లో ఈ నెల కొంత, మిగిలిన మొత్తాన్ని తర్వాత డిపాజిట్ చేస్తామని సహారా ప్రతిపాదించింది. మూడు రోజుల్లోగా రూ. 2,500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని 90 రోజుల్లో డిపాజిట్ చేస్తామని సహారా న్యాయస్థానానికి విన్నవించింది. ఈ ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈసారైనా సహారా గ్రూపు సరైన ప్రతిపాదనతో కోర్టు ముందు రావాలని ‘సుప్రీం’ సూచించింది.