: జర్మనీ లాంటి దేశమే కలిసిపోయింది: కిరణ్
రాష్ట్రం విడిపోయిందని, ఇప్పుడు పార్టీ పెట్టి ఏం చేయగలరని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ, జర్మనీ లాంటి దేశమే గోడ పగులగొట్టి మరీ కలిసిపోయిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గోడలు లేవని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగానే తెలంగాణకు 7 వేల మెగావాట్ల విద్యుత్ తక్కువుందని చెప్పానని, అప్పుడు, 'లేదు మిగులు ఉత్పత్తి సాధ్యమని' చెప్పిన టీఆర్ఎస్ నేతలు, 15 వేల మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని ఇప్పుడు అంటున్నారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రం వచ్చినంత వరకు అన్నీ ఉన్నాయని ప్రజలకు రంగుల కల చూపించిన తెలంగాణ నేతలు ఇప్పడు ఒక్కో విషయాన్ని ఒప్పుకుంటున్నారని ఆయన వెల్లడించారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా ఒకే మాటమీద ఉన్నానని ఆయన అన్నారు. తన మార్గం ఎప్పుడూ ప్రజలవైపేనని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. చివర్లో మీడియాతో చాలా పని ఉందని, వాస్తవాలు వెల్లడించాలని ఆయన మీడియాను కోరారు.