: వారంతా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు: కిరణ్
రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీలన్నీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనలో చేతులు కలిపిన పార్టీలన్నీ తప్పుడు కూతలు కూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పార్టీలకు అధికార దాహం తప్ప మరేమీ అక్కర్లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, టీడీపీ అన్నీ ఈ పాపంలో పాలుపంచుకుని ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాయని ఆయన విమర్శించారు. వారు చెప్పే మాటలకు అర్థం లేదని ఆయన తెలిపారు. తమ పార్టీ లక్ష్యం తెలుగు ప్రజల గుండె చప్పుడు వినిపించడమేనని వెల్లడించారు. తనకు పదవీ వ్యామోహం లేదని, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విభజనను వ్యతిరేకించానని ఆయన గుర్తు చేశారు.