: ర్యాంకుల జాబితాలో పడిపోయిన భారత క్రికెటర్లు
ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితాలో భారత క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ కిందికి జారారు. పుజారా ఎనిమిదో ర్యాంకుకు, కోహ్లీ పదో ర్యాంకుకు పడిపోయారు. ఈ జాబితాలో సఫారీ వీరుడు ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లంక బ్యాట్స్ మన్ కుమార సంగక్కర, కరీబియన్ మిడిలార్డర్ హీరో శివనారాయణ్ చందర్ పాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో సెంచరీల మోత మోగించిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. వార్నర్ నిర్ణయాత్మక కేప్ టౌన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలోనూ శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్ లో 135, రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో నెగ్గిన కంగారూలు టెస్టు సిరీస్ ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇక బౌలర్ల జాబితాలో సఫారీ స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ అగ్రపీఠాన్ని పదిలపరుచుకున్నాడు. తర్వాతి స్థానాల్లో ర్యాన్ హారిస్ (ఆస్ట్రేలియా), వెర్నాన్ ఫిలాండర్ (దక్షిణాఫ్రికా), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. కాగా, ఆల్ రౌండర్ల జాబితాలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన టాప్ ప్లేసును కోల్పోయాడు. సఫారీ ఆల్ రౌండర్ ఫిలాండర్ అతని స్థానాన్ని ఆక్రమించాడు.