: ఆమె తల్లికాదు... రాక్షసి!
అమ్మంటే... ఏ ఆపద వచ్చినా బిడ్డలను అక్కున చేర్చుకునే అమృతమూర్తి అని మనకెన్నో దృష్టాంతాలున్నాయి. కానీ ఈ తల్లి తన రక్తం పంచుకుని పుట్టిన బిడ్డనే నరకకూపంలోకి తోసింది! పట్టుమని పదహారేళ్ళు కూడా లేని ఆ చిన్నారిని వ్యభిచారం రొంపిలోకి దింపింది. ఢిల్లీలో చోటు చేసుకుందీ ఘోరం. పశ్చిమ ఢిల్లీకి చెందిన 13 ఏళ్ళ బాలిక తండ్రి కొన్నేళ్ళ క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. దాంతో ఆమె తల్లి ఆ టీనేజి అమ్మాయిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసింది. అంతేగాకుండా, ఆమెను మూడు వేర్వేరు ప్రదేశాలకు పంపింది కూడా.
అక్కడ తనను కొందరు అసహజ రతి, మౌఖిక శృంగారం చేయాలని బలవంతం చేశారని ఆ బాధిత బాలిక తెలిపింది. తానందుకు నిరాకరించడంతో హింసించడమే కాకుండా, రోజుల తరబడి ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తన నాయనమ్మ సాయంతో ఆ బాలిక ఇంటి నుంచి పారిపోయి మంగళవారం పశ్చిమ్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.