: హాజారేను గౌరవిస్తా... కేజ్రీవాల్ పై కామెంట్ చేయను: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నయంగా మూడో ఫ్రంట్ రావాలని కోరుకుంటున్న నాయకురాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీ తరపున లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటించిన మమత... కాంగ్రెస్, బీజేపీల అంతం ఖాయమని ధీమాతో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆమె విపులంగా మాట్లాడారు. తను సాధారణ పౌరురాలినని, ప్రధాని అభ్యర్థిగా పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. తదుపరి ప్రధాని ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని, ఓటర్లను నమ్మాలన్నారు. తనకు మీడియాపై అవగాహన లేదన్న మమత ఫేస్ బుక్ పై చాలా అవగాహన ఉందని చెప్పారు.
నాయకత్వ కొరతను దేశం ఎదుర్కొంటోందన్న దీదీ, దేశాన్ని భూస్వాములు పాలిస్తున్నప్పుడు మంచి విషయాలు ఎలా ఆశిస్తామన్నారు. ఏడాది పాటు అటల్ బిహారీ వాజ్ పేయి మంచి ప్రధానిగా ఉన్నారని, ఒకరినొకరితో ప్రధానులను పోల్చలేమని చెప్పారు. ఆర్థిక అనుకూలమైన, పరిశ్రమ అనుకూలమైన, జీడీపీ అనుకూలమైన విధానాల ఏర్పాటు ఉంటుందని తెలిపారు. విమానాశ్రయాల వీఐపీ లాంజ్ లను తానెప్పుడూ ఉపయోగించుకోలేదని చెప్పిన ఆమె, ప్రజలు తనతో మాట్లాడవచ్చన్నారు. ఢిల్లీ వెళ్లడానికి ఎప్పుడూ ఇష్టపడనన్నారు. పశ్చిమ బెంగాల్ లో పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాయని, ఇంకా విస్తరిస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 ఓ సున్నితమైన అంశమని, దానిపై మాట్లాడటానికి తనకు అధికారం లేదన్నారు.
అన్నా హజారేను గౌరవిస్తానని, అరవింద్ కేజ్రీవాల్ తనకు తెలియదు కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. పొత్తు పెట్టుకోవాలని అన్నా తనను ఎప్పుడు అడగలేదన్నారు. కేంద్ర జీడీపీ కన్నా బెంగాల్లో పరిశ్రమల అభివృద్ధి డబుల్ గా ఉందని వివరించారు. మావోయిస్టుల కన్నా నక్సల్స్ భిన్నంగా ఉంటారన్నారు. మహిళలు చాలా శక్తిమంతులని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాను 45 పుస్తకాలు రాసినట్లు చెప్పారు. వార్తా పత్రికలు దేవుళ్లు కాదన్న మమత, వాస్తవాలను వక్రీకరిస్తారన్నారు. చాలామంది నేతలతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయన్న ఆమె రాజకీయంగా వారు తనను ఇష్టపడరని చెప్పారు. ఈ ప్రపంచంలో జలసీకి మందే లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తమను పట్టించుకోలేదని, ఒకానొక సమయంలో మేం ఒంటరి వాళ్లమని బెదిరించినట్లు చెప్పారు.