: ఎన్నికల నగారా మోగింది
ఎన్నికల నగారా మోగింది. 16వ లోక్ సభ ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ విడుదల చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ముమ్మర కసరత్తు చేశామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షలు, వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూలు రూపొందించినట్టు ఆయన చెప్పారు.
ఎన్నికల షెడ్యూలుపై అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలను సంప్రదించామని ఆయన వెల్లడించారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 కోట్ల మంది కొత్త ఓటర్లు జాబితాల్లో చేరారని ఆయన తెలిపారు. దీంతో, దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ఏర్పాటు చేశామని, ఇంకా ఎవరైనా ఉంటే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 9 లక్షల 30 వేల పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
మార్చి 7న మొదలై మే 12న జరిగే చివరి ఎన్నికలతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆయన వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణకు అధికారులను నియమించామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయని ఆయన అన్నారు. దీంతో, నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మే 31 నాటికి కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరించారు.