: బంతి పడకుండానే ఎనిమిది పరుగులొచ్చాయి!
పాకిస్తాన్ స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్ అత్యంత చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ లో నేడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో రెహ్మాన్ ఒక్క బంతి వేయకుండానే 8 పరుగులు సమర్పించుకున్నాడు. ఎలాగంటే, ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బంతిని అందుకున్న ఈ స్పిన్నర్ తొలి బంతిని విసరగా అది ఫుల్ టాస్ అయింది. అంపైర్ దాన్ని నోబాల్ గా ప్రకటించాడు. రెండో బంతి కూడా ఫుల్ టాసే. బ్యాట్స్ మన్ కు ఛాతీ ఎత్తులో రావడంతో దీన్నీ నోబాల్ గా ప్రకటించాడు అంపైర్. ఈ బంతికి ఓ పరుగు కూడా తీశాడు బంగ్లా బ్యాట్స్ మన్ కయెస్.
మూడో బంతీ అదే రీతిలో విసిరాడు రెహ్మాన్. ఆ ఫుల్ టాస్ బంతిని అనాముల్ హక్ బౌండరీగా మలిచాడు. ఇదీ నోబాలే. మొత్తమ్మీద రెహ్మాన్ మూడు నోబాల్స్ విసరగా మూడు రన్స్ ఖాతాలో చేరాయి. ఇక హక్ కొట్టిన ఫోర్, కయెస్ సింగిల్ తో కలిపి మొత్తం ఎనిమిది పరుగులన్నమాట. దీంతో, చెత్త గణాంకాలు నమోదు చేసిన రెహ్మాన్ (0-0-8-0) ను తప్పించిన పాక్ కెప్టెన్ మిస్బావుల్ బంతిని మరో స్పిన్నర్ ఫవాద్ ఆలమ్ కు ఇచ్చి ఆ ఓవర్ ఎలాగో పూర్తి చేయించాడు.