: సుప్రీంకోర్టు స్టే ఇస్తే... రాజకీయాల్లో కొనసాగుతా: లగడపాటి
గత నెలలో రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలకు తెరదీశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే రాజకీయాల్లో కొనసాగుతానని అన్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాజగోపాల్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందడంతో రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి తెలిసిందే. విభజనపై స్టే ఇవ్వలేదంటే ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని లగడపాటి స్పష్టం చేశారు. దీంతో, రాజకీయ జీవితంపై లగడపాటికి ఇంకా మోజు తీరినట్టులేదని ఆయన వ్యతిరేకులు అంటుండగా, ఇంకా చివరి బంతి మిగిలే ఉందని ఆయన అనుకూల వర్గం వ్యాఖ్యలు చేస్తోంది.