: కాంగ్రెస్ వాళ్లు సోనియా గాంధీ ఎవరని అడుగుతారు: వెంకయ్యనాయడు
హైదరాబాద్ తెలంగాణలో ఉండాలని డిమాండ్ చేసింది బీజేపీ అని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదును యూటీ చేయాలని డిమాండ్ వచ్చిందని తెలిపారు. అన్నింటినీ వ్యతిరేకించి హైదరాబాదును తెలంగాణలో ఉండాలని చెప్పి సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని సూచించామని అన్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరని అడుగుతున్నారని, అలాగే లోక్ సభ ఎన్నికల తరువాత కేంద్ర మంత్రులంతా సోనియా గాంధీ ఎవరని అడిగే ప్రమాదం ఉందని అన్నారు.
తెలంగాణ ఇవ్వడం తనకు ఇష్టం లేదని జైరాం రమేష్ రాష్ట్ర ఏర్పాటు తరువాత అంటున్నారని, ఎందుకంటే అతను సీమాంధ్ర రాజ్యసభ సభ్యుడు అన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో ఎవరు ఏం మాట్లాడారో ప్రజలంతా చూశారని ఆయన తెలిపారు. జీవోఎంలోకి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులు ఎవరికీ పరిజ్ఞానం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక ప్రతిపత్తి కావాలని చాలా రాష్ట్రాలు పోరాడుతున్నాయని, కానీ సీమాంధ్రకు మాత్రం బీజేపీ కారణంగా వచ్చిందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
అంజయ్యను, పీవీని అవమానించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం జరిగిందో ఆ పార్టీకి గుర్తుండే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కొత్త జ్వరం వచ్చిందని అన్నారు. ఆ జ్వరం పేరు మోడీ అని, మోడీ భయం పట్టుకోవడం వల్లే తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే నాలుగు ఓట్లు రాలుతాయని ఆశించారని అందరూ అంటున్నారని, దానికి సమాధానం చెప్పాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. మోడీ భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన దుయ్యబట్టారు.