: కేసీఆర్ మోసం చేస్తారని ముందే చెప్పా: వీహెచ్
కాంగ్రెస్ లో విలీనం లేదు, పొత్తు కూడా లేదని తేల్చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యక్తిత్వం మొదటి నుంచి అందరికీ తెలుసని... విలీనం విషయంలో మోసం చేస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రమే తనకు ముఖ్యమని సోనియాను కోరిన కేసీఆర్... ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటవగానే మాట తప్పారని ఆరోపించారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన స్వార్థం కోసం మాట మార్చిన కేసీఆర్ నైజాన్ని తెలంగాణ విద్యార్థులు, ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుని... టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తే మంచిదని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజావ్యతిరేకత తప్పదని స్పష్టం చేశారు.