: మెషిన్లలోని లోపాలు మాకు అంటకడితే ఎలా: పెట్రోలు బంకు యజమానుల అసోసియేషన్
పెట్రోలు పరిమాణాన్ని కొలిచే యంత్రాల్లో లోపాలున్నాయంటూ అధికారులు కేసులు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టామని పెంట్రోలు బంకు యజమానుల అసోసియేషన్ తెలిపింది. హైదరాబాదులో సమ్మె విరమణ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెట్రోలు బంకుల్లో మెషిన్లను పెట్రోలు కంపెనీలు సరఫరా చేస్తాయని, వాటిలో తప్పులు ఉన్నాయంటే, అందుకు కంపెనీలను బాధ్యులను చేయకుండా తమ తప్పు ఉందని అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న పెట్రోలు బంకులపై కేసులు నమోదు చేయడం తప్పు కాదని, అలాంటి వాటిపై కేసుల నమోదుకు తాము కూడా సహకరిస్తామని తెలిపారు. మెషిన్లలో లోపాలపై కంపెనీలను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ అభిమతం కాదని, తమ సమస్య పరిష్కారానికి ఇంతకంటే మరో మార్గం లేదని వారు స్పష్టం చేశారు.